జితేశ్ శర్మ ఫొటో షూట్ కెప్టెనేనా! ధావన్ గైర్హాజరీలో పంజాబ్ పగ్గాలు కర్రన్‌కు ఇవ్వడంపై వివాదం

జితేశ్ శర్మ ఫొటో షూట్ కెప్టెనేనా! ధావన్ గైర్హాజరీలో పంజాబ్ పగ్గాలు కర్రన్‌కు ఇవ్వడంపై వివాదం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డ విషయం తెలిసిందే. గాయం కారణంగా పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్.. ఈ మ్యాచుకు దూరమయ్యాడు. దీంతో అతడి ప్లేసులో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.


పంజాబ్ వైస్ కెప్టెన్ జితేశ్ శర్మ కదా..!

కాగా ఐపీఎల్ 2024లో ప్రారంభానికి ముందు తమ జట్టు వైస్ కెప్టెన్‌గా జితేశ్ శర్మ పేరును పంజాబ్ కింగ్స్ ప్రకటించింది. కెప్టెన్ల ఫొటో షూట్‌కు ధావన్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో జితేశ్ శర్మను.. ఫొటో సెషన్‌కు పంపించింది.

ఇక ఫొటో షూట్‌కు జితేశ్ శర్మను వైస్ కెప్టెన్‌గా ప్రకటించిన పంజాబ్ కింగ్స్.. శనివారం నాటి మ్యాచులో అతడిని పక్కన పెట్టి సామ్ కర్రన్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఇది వివాదానికి కారణమైంది. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్‌కు గాయమైందని.. అందుకే ఈ మ్యాచుకు దూరమయ్యాడని టాస్ సందర్భంగా సామ్ కర్రన్ చెప్పుకొచ్చాడు. కాగా కెప్టెన్ల ఫొటో షూట్‌కు జితేశ్ శర్మను పంపించిన పంజాబ్ కింగ్స్.. మ్యాచుకు మాత్రం ఎందుకు సామ్ కర్రన్‌ను కెప్టెన్ చేసిందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటువంటప్పుడు ఫొటో సెషన్‌కు కూడా అతడినే పంపాల్సింది కదా అని కామెంట్లు చేస్తున్నారు.