జీవితంలో విజయం సాధించడానికి ఈ శక్తివంతమైన శ్రీరామ మంత్రాలను పఠించండి..!

జీవితంలో విజయం సాధించడానికి ఈ శక్తివంతమైన శ్రీరామ మంత్రాలను పఠించండి..!

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర నవరాత్రుల్లో శుద్ధ నవమి తిథి నాడు శ్రీరామ నవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన బుధవారం నాడు శ్రీరామ నవమి వచ్చింది. ఇదిలా ఉండగా.. హిందూ మత విశ్వాసాల ప్రకారం, శ్రీరాముడు సుగుణావంతుడు.. పురుషులలో ఉత్తముడు.. ఏకపత్నీవ్రతుడు, అమ్మనాన్నల మాటను శిరసా వహించేవాడు.. నిత్యం నిజం చెప్పే గొప్పవాడు.. ఇలా ఎన్నో విశిష్టతలు ఉండే శ్రీరాముని అనుగ్రహం కావాలంటే శ్రీరామ నవమి వేళ కొన్ని మంత్రాలను కచ్చితంగా జపించాలి. ఇవి అత్యంత శక్తివంతమైనవి. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి వేళ శ్లోకాలను పఠిస్తే శ్రీ మహా విష్ణువు సహస్రనామం పఠించినట్టే అని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి వేళ మంత్రాలను పఠించడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

‘‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం, రామ రామ వరాననే’’
ఈ ఒక్క శ్రీరాముని శ్లోకం పఠించడం వల్ల శ్రీ మహా విష్ణువు సహస్రనామం పఠించినంత ఫలితం వస్తుందని శివయ్య తన భార్య పార్వతీ దేవితో చెప్పినట్లు పురాణాల్లో వివరించబడింది.
ఈ మంత్రంలో ‘ర’కారము రుద్రుడిని.. ‘అ’కారము బ్రహ్మయ్యను, ‘మ’కారము శ్రీహరిని సూచిస్తుంది. అందుకే ‘రామ’ అనే పదాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపంగా పరిగణిస్తారు.

‘రామ’ అనే రెండక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు. ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.